సత్తుపల్లి లో 589 మందికి గృహలక్ష్మి : సండ్ర వెంకట వీరయ్య

సత్తుపల్లి, వెలుగు: సత్తుపల్లి మండలంలోని 589 మందికి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గృహలక్ష్మి అందజేశారు. గురువారం సత్తుపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్​లో 23 గ్రామ పంచాయతీల లబ్ధిదారులకు ఎమ్మెల్యే మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్​హయాంలో తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పక్కదారి పట్టిందని విమర్శించారు. అలా మోసపోయినవారు గంగారంలో ఇంకా ఇళ్ల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. 

గృహలక్ష్మి పొందిన ప్రతిఒక్కరూ ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ హైమావతి, జడ్పీటీసీ రామారావు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మందపాటి శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు మందపాటి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తల్లాడ: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు స్కీములు మాయ మాటలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. గురువారం తల్లాడ మండలంలోని మంగాపురం, తల్లాడ, గొల్లగూడెం, అంజనాపురం, నూతనకల్ గ్రామాల్లో రూ.35 కోట్లతో నిర్మించనున్న ఆర్అండ్ బీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్​పార్టీపై విమర్శలు గుప్పించారు.