- పంట రెండు తడులకు నీళ్లిచ్చిన రైతు బాంధవుడు కేసీఆర్
- ఈ డెవలప్ చూసి ఏపీలోని ప్రజలు అసూయపడుతున్రు..
- ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
సత్తుపల్లి/కల్లూరు, వెలుగు : సత్తుపల్లి అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.1000 కోట్లు ఇచ్చారని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గుర్తు చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ ఎన్టీఆర్స్ఫూర్తితో కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఆంధ్ర సరిహద్దులో ఉన్న సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఏపీ ప్రజల అసూయపడుతున్నారని తెలిపారు.
వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని సీఎం దృష్టికి తీసుకు వెళ్లగానే ఎన్ఎస్పీ కాల్వ నుంచి రెండు తడులకు నీటిని అందించిన రైతు బాంధవుడు కేసీఆర్అన్నారు. ఎన్నో ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడా దళితులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అలాంటిది నేడు దళిత బంధు పథకానికి రూపకల్పన చేసిన అభినవ అంబేద్కర్ కేసీఆర్ అని అభివర్ణించారు. గోదావరి జలాలతో పాలేరు జలాలను అనుసంధానం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు.
సత్తుపల్లి నియోజకవర్గం అంతట దళితబంధు అమలు చేసేలా జీవో జారీ చేశారని, దీంతో 30 వేల కుటుంబాలకుపైగా లబ్ధి చేకూరనుందని చెప్పారు. సత్తుపల్లిలో 100 పడకలు, పెనుబల్లి, కల్లూరులో 50 పడకల నూతన ఆసుపత్రి భవనాలు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. కల్లూరులో మినీ స్టేడియంలో నిర్మాణం పూర్తి అయిందని, చాకలి ఐలమ్మ భవనం, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. మరోసారి బీఆర్ఎస్ను గెలించాలని ప్రజలను కోరారు.
మంత్రి, ఎమ్మెల్యే డ్యాన్సులు
సింగర్ మధుప్రియ తన పాటలతో ప్రజలను ఆకుట్టుకుంది. ఆమె పాటకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్టెప్పులు వేసి ప్రజలను ఉత్తేజపరిచారు. సమావేశంలో ఎంపీలు నామ నాగేశ్వరరావు, బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీలు తాతా మదు, రఘోత్తం రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, అశ్వారావుపేట, వైరా ఎమ్మెల్యే లు మెచ్చా నాగేశ్వరావు, రాములు నాయక్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరి, ఎంపీపీ బీరవెల్లి రఘు, జడ్పీటీసీ కట్ట అజయ్ కుమార్, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, మండల పార్టీ అధ్యక్షుడు పాలెపు రామారావు, రైతు సమితి కన్వీనర్ లక్కినేని రఘు తదితరులు పాల్గొన్నారు.
ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు చొరవచూపాలని ఇల్లెందు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ క్యాండెట్ భానోత్ హరిప్రియ బుధవారం సీఎం కేసీఆర్‌ను కోరారు. ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెం సమీపంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆమె మాట్లాడారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ రాకుండా అన్యాయం చేసింది బీజేపీ, కాంగ్రెస్‌లేనని విమర్శించారు. ఇల్లెందులో మొక్కజొన్న అధికంగా సాగవుతోందని, నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. ఇల్లెందులో ఇప్పటికే 100 బెడ్ల హాస్పిటల్‌ను, బస్ డిపోను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. పోడు భూములకు పట్టాలు ఇప్పించామని తెలిపారు.
దాదాపు రూ. 2,900కోట్లతో నియోజకవర్గంలో బీటీ, సీసీ రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు చేపట్టామన్నారు. టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో దాదాపు 13వేల ఎకరాల సీలింగ్, జంగ్ సిపాయి భూములు ఉన్నాయని, వాటికి పట్టాలివ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇల్లెందులో రైల్వే స్టేషన్ కోసం కృషి చేయాలని కోరారు. నియోజకవర్గంలో బోడు, కొమరారంను మండలాలుగా చేయాలని ఆమె విజ్ఞప్తి చేయగా సీఎం వెంటనే స్పందిస్తూ ఎన్నికల తర్వాత అధికారంలోకి రాగానే మండలాలను ఏర్పాటు చేస్తూ జీఓ ఇస్తామని హామీ ఇచ్చారు.
ఎంపీలు నామా నాయక్, మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర, మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ డి. వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, టీబీజీకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి. వెంకట్రావ్, మిర్యాల రాజిరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, నాయకులు రంగనాథ్, జేవీఎస్ చౌదరి పాల్గొన్నారు.
సభలో పోడు రైతు నిరసన
ఇల్లెందులోని ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతుండగా మండలంలోని బాలాజీతండాకు చెందిన పోడు రైతు భానోత్ వెంకటేశ్వర్లు నిరసన గళమెత్తారు. తన తాత, తండ్రి కాలం నుంచి ఐదెకరాల పోడు భూమిని సాగు చేసుకుంటున్నా తమకు పోడు పట్టాలివ్వలేదంటూ, అధికారులు చుట్టూ తిప్పుకుంటున్నారని కేకలు వేశాడు. వెంటనే పోలీస్‌లు కలుగజేసుకొని సర్ది చెప్పడంతో అతడు సైలెంట్ అయ్యాడు.