సీఎం కేసీఆర్ కోసం పనిచేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సూచించారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణికి నిధుల కేటాయింపుపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. సత్తుపల్లిలో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక అంశాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. ఏ ఒక్క నాయకుడినీ పార్టీ వదులుకోబోదని స్పష్టం చేశారు. సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్దికి సుమారు 350 కోట్లు ఖర్చుపెట్టామని సండ్ర తెలిపారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు. మూడేళ్లలో నియోజకవర్గంలో రూ.17 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ను లబ్దిదారులకు అందించామని చెప్పారు.
సత్తుపల్లిలో 8,500 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్‌లను పంపిణీ చేశామని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉన్న నాయకులే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పారు. ఈనెల 18న జరిగే ఖమ్మం సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.