కరీంనగర్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పార్టీ ఫిరాయింపులకు కేసీఆర్ క్షమాపణ చెబితే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి తనను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటున్నారు.. మరీ గతంలో వేరు వేరు పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన వారిని రాజీనామా చేయించారా..? అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి ఘటనపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్టేట్మెంట్ను కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు సోమవారం (జనవరి 13) రికార్డ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కలెక్టరేట్లో మంత్రుల సమక్షంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేతితో నన్ను నెట్టేశాడు.
ప్రభుత్వ మీటింగులో కౌశిక్ రెడ్టి నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి కౌశిక్ రెడ్డి ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. నేను ఎప్పుడూ కూడా ఏ వ్యక్తినీ దూషించలేదన్నారు. కౌశిక్ రెడ్టి రాజకీయాల్లోకి రాకముందే అయనపై కేసులు ఉన్నాయని.. అందరినీ బెదిరించడం ఆయనకు అలవాటని విమర్శించాడు. గతంలో వరంగల్లో ఇలాగే బెదిరించి సెటిల్మెంటు చేశాడని అన్నారు. కౌశిక్ రెడ్డి తీరుపై స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేశానని.. చర్యలు తీసుకోవాలని కోరానని తెలిపారు.
ALSO READ | కేసీఆర్పాలనలో భారీగా నిధులు దుర్వినియోగం : రవీంద్ర నాయక్
కౌశిక్ రెడ్టి వ్యాఖ్యలను ఎవరూ హర్షించరని అసహనం వ్యక్తం చేశారు. జిల్లా సమీక్ష సమావేశంలో నేను ప్రజా సమస్యలపై మాట్లాడుదామనుకుంటే నాకు అటంకం కలిగించాడని మండిపడ్డారు. జగిత్యాల అభివృద్ధి కొరకే ప్రజలు నన్ను గెలిపించారి.. అభివృద్ధి చేయడం నా ధర్మమన్నారు. కాంగ్రెస్ పార్టీతో నేను కలిసి పనిచేస్తే ఇంత అక్కసు ఎందుకు..? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు.
కౌశిక్ రెడ్టి నేపథ్యం ఏంటో అందరికీ తెలుసని.. నన్ను అనేముందు ఆయన ఎన్ని పార్టీలు మారారో చూసుకోవాలని చురకలంటించారు. కౌశిక్ రెడ్టి నాపై దాడి చేయడాన్ని బాధతో ఖండిస్తున్నానని.. నాకు అండగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. గంగుల కమలాకర్ నాకు మంచి మిత్రుడని.. ఈ ఘటన తర్వాత నాపై ఆయన చేసిన కామెంట్స్ పైన ఎవరో చెబితే చేశాడు తప్ప ఆయన గుండెలో నుంచి వచ్చిన మాటలు కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.