రాహుల్ గాంధీ నాలుక కోస్తే రూ.11 లక్షలు ఇస్తా.. శివసేన ఎమ్మెల్యే షాకింగ్ ఆఫర్

రాహుల్ గాంధీ నాలుక కోస్తే రూ.11 లక్షలు ఇస్తా.. శివసేన ఎమ్మెల్యే షాకింగ్ ఆఫర్

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి నుండే ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ షూరు అయ్యింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై శివసేన (ఏక్‌నాథ్) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు ఇస్తానని కాంట్రవర్శియల్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ ఇటీవల రెండు రోజుల పాటు అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. అమెరికా టూర్‎లో రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ స్పందించారు. 

ALSO READ | వంద రోజుల పాలన ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది : ప్రధాని మోదీ

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ రిజర్వేషన్లను అంతం చేయడం గురించి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు రిజర్వేషన్లపై కాంగ్రెస్ అసలు రూపాన్ని బయటపెట్టాయని ధ్వజమెత్తారు. అణగారిన వర్గ ప్రజలకు గాంధీ వ్యాఖ్యలు అతి పెద్ద ద్రోహమని మండిపడ్డారు. ఓ వైపు మరాఠాలు, ధన్‌గర్లు, ఓబీసీలు వంటి వర్గాలు రిజర్వేషన్ల కోసం పోరాడుతుంటే.. రాహుల్ గాంధీ మాత్రం రిజర్వేషన్లు అంతం చేయడం గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లను రద్దు చేయాలని ఆలోచిస్తోన్న రాహుల్ గాంధీ నాలుక కత్తిరించిన వారికి రూ.11 లక్షలు ఇస్తానని ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 

ALSO READ | హక్కులు సాధించుకోవాల్సిందే.. మహిళలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ​గాంధీ పిలుపు

రాహుల్ గాంధీ ఎప్పుడు రాజ్యాంగ పుస్తకాన్ని చూపించి బీజేపీ దానిని మారుస్తుందని తప్పుడు ప్రచారం చేశారని.. కానీ దేశాన్ని 400 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాలని యోచిస్తున్నది కాంగ్రెస్ పార్టీనే అని గైక్వాడ్ విరుచుకుపడ్డారు. ఇదిలా ఉంటే, గైక్వాడ్ కామెంట్స్ మహా పాలిటిక్స్‎ను వేడెక్కించాయి. సంజయ్ గైక్వాడ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేసింది. అయితే, మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే ఎమ్మెల్యే సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు. గైక్వాడ్ వ్యాఖ్యలను తాను సమర్ధించనని పేర్కొన్నారు.