కాంగ్రెస్ ఇచ్చిన ఇందిరమ్మ పట్టాలకు దిక్కు దివానా లేదు : సంజయ్ కుమార్

జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు.  ఎమ్మెల్యే సంజయ్ పట్టాలు ఇస్త అంటున్నరు కానీ తాను గెలిచాక  నిధులు ఇస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు.  15 ఏళ్ల క్రితం  కాంగ్రెస్ హాయంలో ఇచ్చిన ఇందిరమ్మ పట్టాలకు దిక్కు దివానా లేదన్నారు.  ఆ పట్టాలు అప్పు పత్రాలతో ఇందిరమ్మ ఇండ్ల బాధితులు తన  దగ్గరికి వస్తున్నారని చెప్పారు.  ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అప్పులను అప్పటి ప్రభుత్వం కట్టకపోవడంతో 2016 లో సీఎం   కేసీఆర్ చెల్లించారని సంజయ్ చెప్పారు.  

కళ్యాణలక్ష్మీతో పాటుగా తులం బంగారం ఇస్తామంటున్న కాంగ్రెస్ హామీపై  సంజయ్ కుమార్ మాట్లాడారు.  గతంలో ఈసమెత్తు కట్నకానుకలు ఇవ్వని కాంగ్రెస్ ఇప్పుడు తులం బంగారం ఇస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు.  అసలు రాష్ట్రంలో  కాంగ్రెస్ గెలుస్తుందా..   వీళ్ళకు టికెట్లు ఇచ్చేది ఎవరో తెల్వదన్నారు.  కాంగ్రెస్  పార్టీ నడిపే డ్రైవరెవరో తెల్వదని ఎద్దేవా చేశారు.  

రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎందుకు కళ్యాణలక్ష్మీ ఇవ్వడం లేదో జీవన్ రెడ్డి చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.  ఏఐసీసీ సభ్యులైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  దీనిని  జాతీయ కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకెళ్లి దేశమంతా అమలు చేయాలని ఎందుకు చెప్పలేదో చెప్పాలన్నారు.  కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు పెళ్లిలకు పేరంటాలకు వెళ్లి  ఎంత మందికి ఈసమెత్తు బంగారం పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.