జగిత్యాల టౌన్, వెలుగు : గత ప్రభుత్వాలు 30 ఏండ్లలో చేయలేని అభివృద్ధి మూడేళ్లలో చేశానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. గురువారం ఎమ్మెల్సీ ఎల్.రమణ, జడ్పీ చైర్పర్సన్వసంత, మాజీ మంత్రి రాజేశంగౌడ్‌తో కలిసి సంజయ్‌కుమార్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిదని, నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.
కంటి డాక్టర్‌గా ప్రజలకు చేసిన సేవను గుర్తించి 2014 లో కేసీఆర్ జగిత్యాల టికెట్ ఇచ్చారని, ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, 2018లో ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. ప్రశ్నించేందుకే ఉన్నానని చెప్పుకునే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవీ కాలం మరో రెండేళ్లు ఉండగా, పోటీ ఎందుకు చేస్తున్నారోనని విమర్శించారు. ర్యాలీలో లైబ్రరీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ , బీఆర్ఎస్ పట్టణ, మండలాల అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.