జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఎవరు పోటీ చేస్తారో తెలియదు కానీ..తాను లేకున్నా పోటీలో ఎవరున్నా గెలిపించాలని అన్నారు. ఇప్పుడే ఎన్నికల సమయం కాదన్న సంజయ్.. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత జగిత్యాలను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పుకచ్చారు. రేపు(ఆగస్టు 21) సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ను ప్రకటించనున్నారన్న నేపథ్యంలో సంజయ్ చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారాయి. మరోవైపు సంజయ్ కి అధిష్టానం ఈ సారి టికెట్ ఇవ్వకపోవచ్చుననే ప్రచారం జోరుగా సాగుతోంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులెవరో తేలిపోనుంది. అధికార పార్టీ ఫస్ట్ లిస్ట్ సోమవారం(ఆగస్టు 21) విడుదల కానుంది. 90కి పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయని తెలిసింది. నిజానికి నాలుగైదు సీట్లు మినహా మిగతా అన్నిచోట్ల అభ్యర్థులను ప్రకటిస్తారని మొదట ప్రచారం జరిగింది.
కానీ ఫస్ట్ లిస్ట్ లో 90 మందికి పైగా అభ్యర్థుల పేర్లు ఉండొచ్చని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. సోమవారం(ఆగస్టు 21) మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని పేర్కొన్నారు. కేసీఆర్ సెంటిమెంట్ ప్రకారం ఆరు అంకె వచ్చేలా అభ్యర్థుల సంఖ్య ఉంటుందని సమాచారం.