
మెదక్ (పెద్దశంకరంపేట), వెలుగు: మండలంలోని ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికారులు కృషి చేయాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. బుధవారం మండల పరిషత్ ఆఫీసులో ఎంపీపీ జంగం శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పెద్దశంకరంపేట పట్టణ శివారులో ఉన్న పట్టా భూములను ఎవరైనా ఆక్రమిస్తే వెంటనే నోటీసులు పంపించి కాపాడుకోవాలన్నారు.
గత ఐదు సంవత్సరాల రికార్డులను తీసి ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ గ్రేసీబాయికి సూచించారు. ఇరిగేషన్, ఐబీకి సంబంధించిన నాలుగు ఎకరాల స్థలాన్ని వెంటనే సర్వే చేయించి, హద్దులు పాతడంతో పాటు, ఎవరైనా కబ్జాలో ఉంటే వాటిని తొలగించాలన్నారు. పట్టణంలో అక్రమ వెంచర్లు ఉంటే వాటికి నోటీసులు అందించి సక్రమంగా ఉన్నాయో లేవో పరిశీలించాలన్నారు.
రాణి శంకరమ్మ భూములకు సంబంధించి బినామీ పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేశారని తమ దృష్టికి వచ్చిందని, వీటిపై కూడా తహసీల్దార్ వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా, తహసీల్దార్ గ్రేసీబాయ్, సర్పంచ్ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ లక్ష్మి, మండల కాంగ్రెస్ నాయకులు మధుసూదన్, సురేందర్ రెడ్డి, నారాగౌడ్, పండరి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.