బషీర్ బాగ్, వెలుగు: హక్కుల సాధనకు మాదిగలు ఐక్యంగా పోరాడాలని మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ పిలుపునిచ్చారు. మతతత్వ పార్టీకి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కొమ్ముకాయడం బాధాకరమన్నారు. మాదిగ దండోరా 30 ఏండ్ల పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆదివారం ఆవిర్భావ సదస్సు నిర్వహించారు. పలువురు మాదిగ ప్రజా ప్రతినిధులు, తెలంగాణ అరుణోదయ సమాఖ్య వ్యవస్థాపకురాలు విమలక్క, తదితరులు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. మాదిగలకు సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా న్యాయం చేస్తున్నారని సత్యనారాయణ పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు మాదిగలను అన్ని రంగాల్లో మోసం చేసిందని, డిప్యూటీ సీఎంగా రాజయ్యను తొలగించి కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారన్నారు.
ఎస్సీ వర్గీకరణ ఎన్నో ఏళ్ల సమస్య
ముషీరాబాద్: ఎస్సీ వర్గీకరణ ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్రం చేస్తున్న జాప్యానికి నిరసనగా ఆదివారం ఇందిరా పార్క్ ధర్నా వద్ద టీఎస్ ఎమ్మార్పీఎస్ నేత శ్రీనివాస్ దీక్షకు దిగారు. ప్రొఫెసర్ కోదండరాం, ఆర్ కృష్ణయ్య, ఎర్రోళ్ల శ్రీనివాస్, విమలక్క, మేరీ మాదిగ దీక్షకు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ఐక్యంగా పోరాటాలు చేసినప్పుడే హక్కులు సాధించుకుంటామన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయకుండా మాదిగలకు కేంద్రం అన్యాయం చేస్తోందని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు.