తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం దారుణంగా నిర్వహిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పక్ష ఎమ్మెల్యేల పొగడ్తలకు అధిక సమయం ఇస్తున్నారని..సమస్యలు ప్రస్తావిస్తున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అసలు సమయమే ఇవ్వడం లేదన్నారు. అసలు అసెంబ్లీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడానికి నిరసనగా ఎమ్మెల్యే సీతక్క అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేశారు.
సమావేశాలు ప్రారంభమయ్యాక.. సభలోకి వచ్చిన తర్వాత కూడా బిజినెస్ గురించి చెప్పడం లేదని సీతక్క మండిపడ్డారు. అసలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీరో అవర్‌లో కూడా మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చాలా మంది తమ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలని తమకు చెప్తున్నారని.... కానీ ఇక్కడ చూస్తే కనీసం మైకు కూడా ఇవ్వడం లేదని..ఎలా మాట్లాడాలని ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఎమ్మెల్యే సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసన సభలో బీఆర్ఎస్ ప్రతిపక్ష సభ్యులను బుల్డోజ్ చేస్తుందన్నారు. సభలో బీఆర్‌ఎస్ నేతలు పచ్చి అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నామంటూ డబ్బాలు కొంటుకుంటున్నారని..మరి మిషన్ భగీరథ నీళ్లు ఇస్తే.. ప్రతీ ఊర్లో వాటర్ ప్లాంట్‌లు ఎందుకు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంత సేపు మాట్లాడినా మైక్ కట్ చేయరని..కానీ తాము ఒక నిమిషం మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో లేని రేవంత్ రెడ్డి గురించి అసహ్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం అధికార పార్టీ అసెంబ్లీ సమావేశాలను వాడుకుంటోందని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు.