పనిచేయకుండా ప్రచారం చేసుకుంటున్నారన్న మంత్రి హరీశ్ వ్యాఖ్యలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క కౌంటర్ ఇచ్చారు. అగ్గిపెట్టె దొరకని మంత్రి హరీష్ రావు ఆగమాగం మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. నియోజకవర్గమే తనకు ఇల్లని.. ప్రజలే తనకు అండ అని అన్నారు. కరోనా సమయంలో వరదలు వచ్చినప్పుడు అండగా ఉన్నది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ప్రజల కోసం ప్రశ్నిస్తూ ప్రజలతో ఉంటున్నా కానీ.. మీలా ఫాంహౌస్ లో ఉండటం లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ కేంద్రంగా తనను టార్గెట్ చేస్తూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
తనను ఓడించడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు డబ్బుల కట్టలతో నియోజకవర్గంలో తన కార్యకర్తలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు సీతక్క. కేసీఆర్, కేటీఆర్ బినామీలు ములుగులో తిరుగుతూ కోట్లాడి రూపాయలు ఖర్చు చేస్తూ తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గ్రామగ్రామాన కల్తీ మద్యం పంచుతూ ప్రజలను మద్యం మత్తులో ముంచుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పైసలు ఇస్తే తీసుకోండి కానీ కల్తీమద్యం జోలికి పోవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నియోజకవర్గానికి సీడీఎఫ్ నిధులివ్వకుండా తనను ఇబ్బందిపెట్టారని చెప్పారు.