నల్లగొండ : కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారనుండటంపై ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. చండూరులో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమవడాన్ని తప్పుబట్టారు. ఆర్థిక ప్రయోజనాల కోసమే ఆయన బీజేపీలో చేరుతున్నారే తప్ప అభివృద్ధి కోసం కాదని విమర్శించారు. బీజేపీ కండువా కప్పుకుంటే నాయకుల అక్రమాలన్నీ సక్రమాలవుతాయా అని సీతక్క ప్రశ్నించారు. రాజకీయ కుట్రలో భాగంగానే గతంలో రేవంత్ రెడ్డిని జైలుకు పంపారని ఆరోపించారు.
ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం బీజేపీ నైజంగా మారిందని సీతక్క మండిపడ్డారు. తల్లి పాలకు తప్పితే మిగతా అన్నింటికీ పన్ను వేసిన ఘనత బీజేపీకే దక్కిందని విమర్శించారు. సంపాదించడానికి టీఆర్ఎస్.. దాన్ని కాపాడుకునేందుకు బీజేపీ అన్నట్లుగా పరిస్థితి మారిందని.. కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేద ప్రజల కోసం పనిచేస్తోందని చెప్పారు.