![ఎమ్మెల్యే షకీల్ హత్యాయత్నం కేసులో ఇద్దరు మజ్లిస్ కౌన్సిలర్ల అరెస్ట్](https://static.v6velugu.com/uploads/2023/06/MLA-Shakeel_jo4i510H3b.jpg)
నిజామాబాద్, వెలుగు: బోధన్ ఎమ్మెల్యే షకీల్‌ను హతమార్చాలనే కుట్రతో దాడికి ప్రయత్నించి దౌర్జన్యం చేసిన ఇద్దరు మజ్లిస్ పార్టీ కౌన్సిలర్లు అల్తాఫ్, నయీంను అరెస్టు చేసి రిమాండుకు తరలించామని ఏసీపీ కిరణ్‌కుమార్ తెలిపారు. శనివారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే షకీల్ శుక్రవారం రెంజల్ బేస్‌లోని ఒక పాఠశాలకు వెళ్లిన టైంలో నిందితులైన కౌన్సిలర్లు ఆయనపై దాడికి ప్రయత్నించారన్నారు. సీఐ ప్రేమ్‌కుమార్, స్పెషల్ పార్టీ పోలీసులు అడ్డుకొని వారిని స్టేషన్‌కు తీసుకొచ్చారన్నారు. తనను మర్డర్ చేసే ప్లాన్‌తో వచ్చారని ఎమ్మెల్యే షకీల్ తమకు ఫిర్యాదు చేశాక దర్యాప్తు చేయగా నిజాలు తెలిశాయన్నారు.
శర్ఫు అనే వ్యక్తి ఇంట్లో ఎమ్మెల్యేపై దాడికి ఇద్దరు కౌన్సిలర్లు గురువారం ప్లాన్ చేసినట్టు తేలిందన్నారు. సమీర్ అనే రౌడీ షీటర్ ఆ మీటింగ్‌లో ఉన్నాడన్నారు. కౌన్సిలర్ అల్తాఫ్‌పై 14 కేసులు ఇప్పటికే రిజిస్ట్రర్ అయి ఉన్నాయని వివరించారు. ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ వారు వెపన్స్ సమకూర్చుకున్నట్టు నిర్థారించామన్నారు. వాటికి ఎక్కడి నుంచి తెచ్చారు? అందులో ఎవరెవరి ప్రమేయం ఉందనేది విచారణ చేయాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యే షకీల్‌ను హత్య చేసేందుకు తమ పార్టీలోని కొందరు లీడర్లు కుట్ర చేశారని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్‌యాదవ్ ఏసీపీ కిరణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ మున్సిపల్ చైర్పర్సన్ పద్మ భర్త శరత్‌రెడ్డి మరో కౌన్సిలర్ మీర్నజీర్అలీ, లీడర్ శర్ఫు ప్రమేయం కుట్రలో ఉందన్నారు. వారి నేతృత్వంలో రౌడీషీటర్లతో మీటింగ్ నిర్వహించి ఎమ్మెల్యేపై మర్డర్ ప్లాన్ వేశారన్నారు. వారిపై పీడీ యాక్టు అమలు చేయాలన్నారు. మున్సిపాల్ ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ, గంగారాం, గంగాధర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.