ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. జూన్ 30న ఆయన ఓ వీడియోలో మాట్లాడుతూ.. తన మీద ఎంఐఎం కౌన్సిలర్లు హత్యాయత్నం చేశారని ఆరోపించారు. ఇటీవల తనపై జరిగిన దాడి ప్లాన్ ప్రకారమే అయ్యిందని అన్నారు. జైల్లో ఉన్న నిందితులపై ఇది వరకే అనేక కేసులు ఉన్నాయన్నారు. బోధన్ బీఆర్ఎస్ నేత శరత్ రెడ్డి, ఎంఐఎం నేతలు కలిసి తనను చంపాలని కుట్ర చేస్తున్నారన్నారు.
నిజానిజాలు త్వరలో తేలుతాయని పేర్కొన్నారు. రాజకీయంగా ఎదర్కోవాలంటే ఎన్నికల్లో పోటీ పడదామని, హత్యా రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. అసద్ ఎన్నికలు రాగానే తన నైజాన్ని బయటపెడుతున్నారని.. తాను ఎప్పుడూ తప్పుడు కేసులు పెట్టలేదన్నారు. బోధన్ ప్రజలు తనతోనే ఉన్నారని.. రానున్న ఎన్నికల్లో ఇలాంటి రాజకీయాలు చేసే వారికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.