మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే శంకర్ ఆగ్రహం

  • పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశం 

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పనుల్లో నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మున్సిపల్ అధికారులతో కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేఆర్​కే కాలనీలో మంజూరైన రోడ్లు, మురికి కాలువల పనులు ఇంతవరకు ఎందుకు పూర్తి కాలేదని అధికారులను ప్రశ్నించారు. 

గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ నల్లాలు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. ఆదిలాబాద్​లోని ప్రధాన వీధుల్లో రోడ్లను ఆక్రమించుకొని వందల సంఖ్యలో తోపుడు బండ్లు ఉన్నాయని, కేవలం 300 మీటర్ల మార్గం దాటలంటే 20 నిమిషాల సమయం పడుతోందన్నారు. ఆ మార్గం గుండా నడవాలంటేనే మహిళలు భయపడే పరిస్థితి ఉందన్నారు. 

రోడ్లపై ఆక్రమణలు ఉండకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా షెడ్లు నిర్మించినా ఫుట్ పాత్ వ్యాపారులను ఎందుకు షిఫ్ట్ చేయడంలేదని ఫైర్​ అయ్యారు. ఏరోడ్రమ్ పక్కన ఉన్న అక్రమ గోవధ శాలను తొలగించాలని, పెండింగ్​లో ఉన్న కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలని ఆదేశించారు. మున్సిపాలిటీలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా కృషి చేస్తామన్నారు.  మున్సిపల్ కమిషనర్ శైలజ, ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు.