మానుకోట బీఆర్‌ఎస్‌లో మాటల యుద్ధం .. విమర్శలు చేసుకుంటున్నశంకర్‌నాయక్‌, రవీందర్‌రావు

మానుకోట బీఆర్‌ఎస్‌లో మాటల యుద్ధం ..  విమర్శలు చేసుకుంటున్నశంకర్‌నాయక్‌, రవీందర్‌రావు

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌లో ఇన్నాళ్లు అంతర్గతంగా కొనసాగిన ఆధిపత్య పోరు ఇప్పుడు బయటపడుతోంది. మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, ఎమ్మెల్సీ రవీందర్‌రావు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల టైంలో కేటీఆర్‌ జోక్యంతో ఇద్దరూ కలిసి పనిచేయగా, బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఇరువురి అనుచరులు, మద్దతుదారులు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు.

తెలంగాణ ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడం, జోకుడు గాళ్ల కారణంగానే బీఆర్‌ఎస్‌ ఓడిపోయిందని ఎమ్మెల్సీ రవీందర్‌రావు ఇటీవల అసెంబ్లీ వద్ద మీడియాతో చెప్పడం అగ్గి రాజేసినట్లు అయింది. ప్రస్తుతం నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో శంకర్‌నాయక్‌ కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ‘పార్టీలో ఉన్న ఓ పెద్ద మనిషి, పెద్ద పదవి పొంది నా పై భూ ఆక్రమణ ఆరోపణలు చేయిస్తున్నాడు. కన్న తల్లి లాంటి పార్టీకి ఎలా మోసం చేస్తారు? కాంగ్రెస్‌తో లోపాయికారిగా చేతులు కలిపిన దొంగలకు వారం రోజులు టైం ఇస్తున్నా.. వారంతా పార్టీ వదిలి పోవాలి. లేదంటే కార్యకర్తలే బుద్ధి చెబుతారు’ అని హెచ్చరించారు.

ఆయన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ రవీందర్​వర్గీయులు కౌంటర్‌ అటాక్‌ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టించిన చరిత్ర శంకర్‌నాయక్‌దేనంటూ రవీందర్‌రావు ప్రధాన అనుచరుడు బానోతు రవికుమార్‌ ఓ వీడియో రిలీజ్‌ చేశారు. శంకర్​నాయక్​స్థానికుడు కాకున్నా పార్టీ ఆదేశాల మేరకు రెండుసార్లు గెలిపించామని, ఎన్నికల్లో ఓడిపోగానే కార్యకర్తలను బద్నాం చేయడం సరికాదని సూచించారు. శంకర్‌నాయక్‌ వల్లే బీఆర్‌ఎస్‌కు నష్టం జరిగిందని, కబ్జాలతో వందల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. ఆయన ఆస్తుల చిట్టాను తామే బయటపెడుతామని హెచ్చరించారు.