ఎమ్మెల్యే సంతకం ఫోర్జరీ.. 128 మంది అనర్హులకు కల్యాణలక్ష్మి

  • ఎమ్మెల్యే సంతకం ఫోర్జరీ చేశారు!
  • కల్యాణలక్ష్మి అక్రమాలపై దర్యాప్తులో కొత్త కోణాలు
  • ఇచ్చోడలోని మీ సేవా  కేంద్రంగానే అక్రమాలు
  • తల్లిదండ్రుల ఇంటిపేరు ఒకటి, పిల్ల ఇంటిపేరు మరొకటి
  • ఆదిలాబాద్ జిల్లాలో 128 కేసుల గుర్తింపు
  • రెండు రోజుల్లో పై ఆఫీసర్లకు రిపోర్ట్​

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లాలో కల్యాణలక్ష్మి డబ్బులు కాజేసేందుకు అక్రమార్కులు ఏకంగా ఎమ్మెల్యే సంతకాన్నే ఫోర్జరీ చేశారు. గ్రామ కార్యదర్శి నుంచి ఎమ్మెల్యే వరకు అందరి సంతకాలనూ ఇచ్చోడ మీసేవా కేంద్రంలోనే కాపీ కొట్టి అడ్డదారిలో రూ. కోట్లు మింగేశారు. ఈ కేసును  ఉట్నూర్ డీఎస్పీ ఉదయ్​రెడ్డికి  అప్పజెప్పగా ఆయన దర్యాప్తులో విస్తుగొలిపే నిజాలు బయటకు వస్తున్నాయి. మరో రెండురోజుల్లో పై ఆఫీసర్లకు రిపోర్ట్​ అందించనున్నట్లు తెలుస్తోంది.

128 మంది అనర్హులకు కల్యాణలక్ష్మి..

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని మీసేవా సెంటర్​ కేంద్రంగా కల్యాణలక్ష్మిలో జరిగిన అక్రమాలపై పోలీసులు ఇన్వెస్టిగేషన్​ ముమ్మరం చేశారు. రెండు నెలల క్రితం సిరికొండ మండలం పొన్నాకు చెందిన జ్ఞానేశ్వర్ హత్య తో ఈ విషయం వెలుగుచూసింది. ఈ కేసుకు సంబంధించి ఉట్నూర్​ డీఎస్పీ ఉదయ్​రెడ్డి దర్యాప్తులో వివిధ కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఆఫీసర్లు, మీసేవా నిర్వాహకులు కలిసి ఏకంగా 128 మంది పేర్లపై కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ స్కీముల కింద సొమ్ము స్వాహా చేసినట్లు తేలింది.   కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ స్కీంలే కాకుండా ఇచ్చోడ మీ సేవా సెంటర్​ కేంద్రంగా అనేక అక్రమాలు జరిగినట్లు పోలీసుల తాజా దర్యాప్తులో బయటపడింది. వ్యవసాయ భూములు లేకున్నా  ఉన్నట్లు  సృష్టించడం, టైటిల్, పాస్ బుక్​ల తయారీ, ఆఫీసర్లతో కుమ్మక్కై లోన్లు మంజూరు చేయించుకోవడం ఇక్కడ సర్వసాధారణమని తెలుస్తోంది.  ఈ మొత్తం వ్యవహారంలో మీ సేవా సెంటర్​ నిర్వాహకులతోపాటు  వివిధ ఉద్యోగుల పాత్రపైనా రిపోర్ట్​రెడీ చేసిన డీఎస్పీ ఉదయ్​రెడ్డి ఒకటి రెండు రోజుల్లో పై ఆఫీసర్లకు నివేదించనున్నట్లు సమాచారం. దాని ప్రకారం బాధ్యులైన ఆఫీసర్లు, ఉద్యోగులపైనా చర్యలు ఉంటాయనే చర్చనడుస్తోంది.

ఎమ్మెల్యే సంతకం ఫోర్జరీ చేశారు..

మీ సేవా నిర్వాహకులు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు మా ఇన్వెస్టిగేషన్​లో తేలింది. ఎమ్మెల్యేతోపాటు ఆఫీసర్ల అటెస్టేషన్​ను మీ సేవా సెంటర్​లోనే చేశారు. దర్యాప్తులో తేలిన అంశాలతో పై ఆఫీసర్లకు రిపోర్ట్​ పంపిస్తాం.

‑ ఉదయ్​రెడ్డి, ఉట్నూర్ డీఎస్పీ

బోథ్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్​కు తెలియకుండానే ఏడుగురికి  కల్యాణలక్ష్మి సాంక్షన్​ అయింది. గతంలో ఎమ్మెల్యే  చేసిన సంతకాన్ని స్కాన్ చేసి పెట్టుకున్న మీ సేవా నిర్వాహకులు కొత్త అప్లికేషన్లపై పేస్ట్​ చేసి కథ నడిపించారు. ఆ తర్వాత ఫైల్ ను పద్ధతి ప్రకారం మూవ్​చేసి  డబ్బులు లేపేశారు.

ఈ చిత్రాన్ని చూడండి. పెళ్లి  పిల్ల పేరు జాదవ్ జోత్స్న అయితే ఆమె తల్లి దండ్రుల ఇంటిపేర్లు వేరే ఉన్నాయి. తల్లి పేరు రాథోడ్ జ్యోతి, తండ్రిపేరు జాదవ్ పూల్సింగ్ అని ఉంది. తర్వాత గమనిస్తే  పిల్ల పేరు పౌడ్వాల్ జోత్స్నఅని ఉంటే, ఆమె తండ్రిపేరు అంధు సింగ్ అని ఉంది. తరువాతది మరీ విచిత్రం.  వారంతా మహబూబ్ నగర్ జిల్లాకు చెందినప్పటికీ ఇక్కడ కల్యాణలక్ష్మి వచ్చినట్లుగా ఉంది.