అమ్రాబాద్, వెలుగు: నల్లమల ప్రాంతంలోని చెంచుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. ఆదివారం అమ్రాబాద్, పదర మండలాల్లో ఆయన పర్యటించారు. మన్ననూర్ వనమాలిక వద్ద జాతీయ మొక్కల జన్యు వనరుల బ్యూరో రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పంటల జన్యు వనరుల పరిరక్షణ, జీవ వైవిధ్య సమతుల్యతపై రైతులకు అవగాహన కల్పించారు. పంట వ్యర్థ పదార్థాల వినియోగం, కాలుష్య నివారణ చర్యలు, తదితర అంశాలను వివరించారు.
అనంతరం మన్ననూర్ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన గద్దర్ విగ్రహావిష్కరణ పనులను పరిశీలించి వచ్చే నెల 5న మంత్రులు, ప్రముఖుల సమక్షంలో గద్దర్ విగ్రహావిష్కరణ నిర్వహిస్తామని తెలిపారు. పదర మండలంలో రెండో రోజు ఆధార్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. చెంచుల సమస్యలు తమ దృష్టికి తేవాలని సూచించారు.
ఏజెన్సీలోని చెంచులందరికీ ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఇన్స్యూరెన్స్, క్యాస్ట్, బర్త్ సర్టిఫికెట్ల జారీ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పదర యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీకృష్ణుడి ఆలయాన్ని సందర్శించారు. ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలని, పశువులను అడవిలోకి అనుమతించేలా చూడాలని కోరగా, దీనిపై అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.