రేవంత్ పాదయాత్ర వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే సీతక్క

ములుగు జిల్లాలో ఈనెల 6న రేవంత్ రెడ్డి చేపట్టనున్న హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రకు ఎమ్మెల్యే సీతక్క ఏర్పాట్లు చేస్తున్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర స్ఫూర్తితోనే రేవంత్ రెడ్డి యాత్ర చేపడుతున్నారని ఆమె అన్నారు. అడవి తల్లుల ఆశీర్వాదంతో మేడారం నుండి రేవంత్ పాదయాత్ర మొదలవుతుందని చెప్పారు. ఈ యాత్రలో అన్ని రంగాల ప్రజలు పాల్గొని సంఘీభావం తెలుపాలని సీతక్క పిలుపునిచ్చారు.  ప్రజా సమస్యలు తెలుసుకుని.. పేద ప్రజలకు భవిష్యత్ భరోసా ఇచ్చేదే ఈ పాదయాత్ర అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఈనెల 6 రేవంత్ రెడ్డి షెడ్యూల్‭కు సంబంధించిన వివరాలను సీతక్క వెల్లడించారు. 6న ఉదయం ములుగులో గట్టమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత.. పస్రాలో నిర్వహించనున్న బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు. అనంతరం పాలంపేటలో నైట్ బస చేసి మరుసటి రోజు ఉదయం అక్కడి ప్రజలను కలవనున్నారు. అక్కడ నుంచి  ఘనపూర్, భూపాలపల్లి జంక్షన్ వెల్తూర్ పల్లిలో రెండో రోజు పాదయాత్ర  ప్రారంభం కానుంది.  హాత్ సే హాత్ పాదయాత్రలో భాగంగా ములుగు నియోజకవర్గంలో రెండు బహింగ సభలు ఏర్పాటు చేయనున్నారు. ఈ పాదయాత్ర ద్వారా రేవంత్ ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.