కొత్తగూడ, వెలుగు : కేసీఆర్ ఇచ్చిన పోడుపట్టాలకు వారసత్వ హక్కు లేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే శాశ్వత పట్టాలు ఇస్తామని ములుగు ఎమ్మెల్యే సీతక్క హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఆదివారం ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ములుగు నియోజకవర్గంలో ఎన్నడూ కనబడని నాయకులు ఇప్పుడు ఎన్నికలు రాగానే నోట్ల కట్టలతో వస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించే గొంతుకను కాబట్టే తనను టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గిరిజనులు, గిరిజనేతలుకు రెండు కండ్లు అని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. రెండు పంటలకు నీళ్లు అందించే బాధ్యత తనదేనని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు రూ. 6 లక్షలతో, బీసీ, ఓసీలకు రూ. 5 లక్షలతో ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసీలు, లంబాడీలు, ఏరుకలకు వేర్వేరుగా కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అరకు మాజీ ఎమ్మెల్యే గంగాధరస్వామి సీతక్కకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయారూప్‌సింగ్, జడ్పీటీసీ పుష్పలత, సర్పంచ్ మల్లెల రణధీర్, మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య, నాయకులు నారాయణరెడ్డి, బిట్ల శ్రీనివాస్, సుభాశ్‌రెడ్డి, వేణు పాల్గొన్నారు.