- వ్యవసాయశాఖ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం
ఎడపల్లి, వెలుగు: రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించాలని, రుణమాఫీ కాకపోవడానికిగల కారణాలు తెలుసుకొని తనకు నివేదిక అందజేయాలని వ్యవసాయ శాఖ అధికారులను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఎడపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమకు రుణమాఫీ కాలేదని ఆయన దృష్టికి తేవడంతో వెంటనే స్పందించారు.ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, రుణమాఫీకాని అర్హూలెవరైనా వుంటే ప్రభుత్వంతో చర్చించి న్యాయం చేస్తానని అన్నారు.
పంటమార్పిడి పాటించాలి
పంట మార్పిడి పద్ధతులు అవలంభించాలని రైతులకు బోధన్ ఎమ్మెల్యే సూచించారు. పంటమార్పిడితో భూసారం పెరగడమే కాకుండా రైతులు లాభాలు గడిస్తారని అన్నారు. పంటమార్పిడిలో భాగంగా బోధన్ నియోజక వర్గంలోని రైతులు చెరకు పంట సాగు చేయాలన్నారు. చెరకు సాగు చేస్తే నిజాంషుగర్ ప్యాక్టరీని ప్రారంభిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులిశ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ప్రమీల, మాజీ సర్పంచ్ కోసిగ సాయిలు, తహసీల్దార్ దన్వాల్, ఎంపీడీఓ శంకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బోధన్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి విద్యా, వైద్యరంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే పి.సుదర్భన్ రెడ్డి అన్నారు. మంగళవారం బోధన్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక శాసన సభ్యులు పి. సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 15 లక్షలతో నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. రూ. 66 లక్షలతో చేపట్టనున్న బోధన్ మండల ప్రజా పరిషత్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అన్ని హంగులతో ప్రభుత్వం నూతనంగా నిర్మించ తలపెట్టిన సమీకృత రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, వసతి గృహ సముదాయం కోసం బెల్లాల్ సమీపంలోని మధుమలంచా డిగ్రీ కళాశాల వద్ద స్థలాన్ని పరిశీలించారు. బోధన్ లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, ఇతర వైద్యాధికారులతో సమావేశమై వైద్యుల ఖాళీలు, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు.అన్ని విద్యా సంస్థలు ఒకే ప్రాంగణంలో ఉండేలా బెల్లాల్ మధుమలంచ డిగ్రీ కళాశాల వద్ద సుమారు 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కం హాస్టల్స్ భవన సముదాయం నిర్మించాలని సంకల్పించామన్నారు.
బోధన్ ఎంపీడీఓ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. శిథిలావస్థకు చేరిన బోధన్ మున్సిపల్ కార్యాలయ భవనం స్థానంలో త్వరలో రూ. 4 కోట్ల వ్యయంతో నూతన భవన నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఎమ్మెల్యే వెంట బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ పద్మావతి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తదితరులు ఉన్నారు.