బోధన్​ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లలో పేదలకే ప్రయారిటీ : ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి

ఎడపల్లి, వెలుగు: నిజామాబాద్ జిల్లా  బోధన్​ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లను ముందుగా నిరుపేదలకు ఇస్తామని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు.  ఆ తర్వాత విడతలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తామని స్పష్టం చేశారు.   శనివారం ఎడపల్లి మండల కేంద్రంలో  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనుసరించే విధానంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీలు, ఇందిరమ్మ కమిటీలతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యుహాల గురించి దిశానిర్దేశం చేశారు.

ఏడాది కాలంగా రాష్ట్ర సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలు, నిధుల మంజూరు, రుణమాఫీ లాంటి అంశాలను ప్రజలకు వివరించాలన్నారు.   ఎడపల్లి మండలంలోని తానాకలాన్​, కుర్నాపల్లి గ్రామాలలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్​ బెడ్​ రూం ఇండ్లకు మరమ్మతులు చేసి త్వరలో అర్హులైన లబ్ధిదారులకు కేటాయిస్తామని తెలిపారు.  కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, టీపీసీసీ డెలిగేట్ గంగా శంకర్, ఎడపల్లి మండల పార్టీ  అధ్యక్షుడు పులి శ్రీనివాస్, నాయకులు బిల్లా రామ్మోహన్, మహిపాల్ రెడ్డి, ఎడపల్లి ఎంపీడీవో శంకర్ నాయక్, తహసీల్దార్ దన్వాల్,  జడ్పీ మాజీ వైస్ చైర్మన్ రజిత యాదవ్,  సహకార సంఘం చైర్మన్లు పోల మల్కారెడ్డి, కరటూరి సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.