![పచ్చని అడవిలో డంపింగ్ యార్డ్ తో విధ్వంసం](https://static.v6velugu.com/uploads/2025/02/mla-sunitha-laxma-reddy-opposes-dumping-yard-construction-in-green-forest_n60R3ejELX.jpg)
- ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిర్మాణం ఎలా చేస్తారు
- ప్రశ్నించిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
సంగారెడ్డి టౌన్, వెలుగు: గుమ్మడిదల మండలం ఫ్యారానగర్ లో సర్వే నంబర్ 40, 41లో జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న డంపింగ్ యార్డ్ ను నిలిపివేయాలని గ్రామస్తులు ఆందోళన చేస్తుంటే వందలాది పోలీసులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సరైనది కాదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింత ప్రభాకర్ తో కలిసి కలెక్టర్ వల్లూరు క్రాంతికి వినతి పత్రం అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పచ్చని అడవి మధ్య ఫ్యారానగర్ లో జీహెచ్ ఎంసీ 151 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ యార్డ్ నిర్మించడం ప్రకృతిని ధ్వంసం చేయడమే అన్నారు. స్థానిక రైతులు వరి, కూరగాయలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారని కనీసం సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రి పోలీస్ బలగాలతో డంపింగ్ యార్డ్ నిర్మాణానికి సిద్ధం కావడం సిగ్గుచేటు అన్నారు.
డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో మరో జవహర్ నగర్ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని అడ్డుకున్న రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, గుమ్మడిదల బీఆర్ ఎస్ మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.