
- మెనూ పాటించడం లేదని వార్డెన్‌పై ఆగ్రహం
కౌడిపల్లి, వెలుగు: మండల కేంద్రంలోని సమీకృత బాలికల వసతి గృహంలో అల్పాహారం తిని అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 12 మంది విద్యార్థినులను, హాస్టల్లో చికిత్స పొందుతున్న 35 మంది బాలికలను ఎమ్మెల్యే సునీతారెడ్డి సోమవారం పరామర్శించారు. రెండు గంటల పాటు హాస్టల్ ను తనిఖీ చేసి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మెనూ ప్రకారం ఇక్కడ భోజనం పెట్టడంలేదని హాస్టల్ వార్డెన్ నరసమ్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో చింతపండు, బియ్యం తప్ప కూరగాయలు లేకపోవడం ఏంటని మండిపడ్డారు. హాస్టల్ గదుల్లో లైట్లు, ఫ్యాన్లు సరిగా లేవని, తాగునీటి సమస్య ఉందని, మరుగు దొడ్లకు డోర్లు లేవన్నారు.
హాస్టల్ వార్డెన్ హాస్టల్లో ఉండకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుందని విద్యార్థినులు ఎమ్మెల్యేకు తెలిపారు. రెండు నెలల నుంచి గుడ్లు, చికెన్ పెట్టడం లేదన్నారు. వెంటనే ఎమ్మెల్యే కలెక్టర్ రాహుల్ రాజ్ కు ఫోన్‌చేసి విషయం తెలియజేశారు. హాస్టల్ లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ స్కూల్పునః ప్రారంభం అయ్యే నాటికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారని ఆమె తెలిపారు. ఆమె వెంట ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గనేశ్వర్ , డాక్టర్లు శ్రీకాంత్, వెంకటలక్ష్మి, సూపర్వైజర్లు రమేశ్, షకీల్, హెల్త్ అసిస్టెంట్ శ్రీధర్ ఉన్నారు.