సెస్ ఎండికి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఫోన్ కాల్

బోయినపల్లి మండలం అంతట వ్యవసాయానికి, ఇళ్లకు కరెంట్ కోతలు ఉన్నాయని.. ఈ సమస్య రాకుండా చూడాలని సెస్ ఎండికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సూచించారు. బోయినపల్లి మండలంలో సెస్ ఎన్నికల సందర్భంగా అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలపరచిన కొట్టేపల్లి సుధాకర్ కు ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తున్నారు. విద్యుత్ సమస్యలపై రైతులు, పలువురు సొంత పార్టీ నేతలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో సెస్ ఎండికి ఆయన ఫోన్ చేశారు. ఎన్నికల సమయంలో ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. విద్యుత్ కోతలపై అధికారులకు అధికార పార్టీ వాళ్ళే ఫోన్ కాల్ చేయడంపై ప్రతిపక్ష నాయకుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 24 గంటల కరెంట్ ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో డిసెంబర్ 24వ తేదీన సెస్ డైరెక్టర్ల ఎన్నికలు జరుగనున్నాయి. 26న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు విడుదల చేయనున్నారు.