రాజనర్సింహతో రాజయ్య భేటీ.. రెస్టారెంట్​లో ప్రత్యేక సమావేశం

వరంగల్‍/పాలకుర్తి, వెలుగు:స్టేషన్‍ ఘన్‍పూర్‍ బీఆర్‍ఎస్​ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కాంగ్రెస్‍ సీనియర్​ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈసారి దాదాపు అందరు సిట్టింగులకు బీఆర్​ఎస్​పార్టీ సీట్లు కేటాయించినప్పటికీ స్టేషన్​ ఘన్‍పూర్‍లో మాత్రం రాజయ్యకు కాకుండా ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చింది. ఈ విషయంలో రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉండగా.. కాంగ్రెస్‍ ముఖ్య నేతతో ప్రత్యేకంగా భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‍ టాపిక్​గా మారింది. సోమవారం సాయంత్రం హనుమకొండ నక్కలగుట్టలోని ఎంఎల్‍ గ్రాండ్‍ బ్యాంకేట్‍ హాల్‍ (ప్రెసిడెంట్‍ రెస్టారెంట్‍)లో ఓ ప్రైవేట్‍ సంస్థ ఆధ్వర్యంలో దళిత మేధావుల సదస్సు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్‍ నేత దామోదర రాజనర్సింహ హాజరవగా.. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, నమిండ్ల శ్రీనివాస్‍ తదితర దళిత నేతలతో పాటు స్టేషన్‍ ఘన్‍పూర్​ బీఆర్​ఎస్​ సిట్టింగ్‍ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా వచ్చారు. ఈ ప్రోగ్రామ్​తో సంబంధం లేకుండా రాజయ్య కాంగ్రెస్‍ నేతలతో మరో గదిలో సమావేశమయ్యారు. కాసేపయ్యాక దామోదర రాజనర్సింహ మిగతా కాంగ్రెస్‍ నేతలందరినీ బయటకు పంపి రాజయ్యతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, అందులోనూ స్టేషన్‍ ఘన్‍పూర్‍ పాలిటిక్స్​ రసవత్తరంగా సాగుతున్న ఈ టైమ్​లో  తాటికొండ రాజయ్య కాంగ్రెస్‍ సీనియర్‍ నేతలతో సమావేశమవడం చర్చకు దారితీసింది. 

అంతకుముందు ఒకే వేదికపై కడియం, రాజయ్య

కాంగ్రెస్​ నేతలతో ప్రత్యేక సమావేశానికి ముందు తాటికొండ రాజయ్య ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఒకే వేదికపై పక్క పక్కనే కూర్చొని కనిపించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడిలో జరిగిన రామాలయ వేడుకకు ఇద్దరు నేతలు హాజరయ్యారు. వేడుకలో ఇద్దరు పక్కపక్కనే  కూర్చొని కనిపించడంతో మీడియా ప్రతినిధులు ఫొటోలు తీయసాగారు. దీంతో ‘‘తీస్కోండి.. మేమిద్దరం ఒక్కటే’’ అంటూ కడియం నవ్వూతూ మాట్లాడారు. అయితే.. రాజయ్య మాత్రం వేదిక దిగి వెళ్లి పోయారు.