టికెట్ల విషయంలో మార్పులు జరగవచ్చు : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య

టికెట్ల విషయంలో మార్పులు జరగవచ్చు : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య

జనగామ జిల్లా : ఎన్నికల్లో గెలిచినా, ఓడినా నియోజకవర్గాన్ని పట్టుకొని ఉండేవాడు స్థానిక నాయకుడు అని అన్నారు స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. స్థానిక నాయకులను ఎన్నుకున్నప్పుడే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. మంజూరైన పనులను మళ్లీ మంజూరు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జనవరి 17వ తేదీ వరకు స్టేషన్ ఘనపూర్ కు తానే ఎమ్మెల్యేగా ఉంటానని, అదే రోజు తన ఎమ్మెల్యే పదవి ఆఖరి రోజు అని చెప్పారు. జాఫర్ఘడ్లో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఈ కామెంట్స్ చేశారు. 

ఎమ్మెల్యే టికెట్ల విషయంలో మార్పులు చేర్పులు జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నారని అన్నారు ఎమ్మెల్యే రాజయ్య. ఈ క్రమంలోనే టికెట్లు రానివాళ్లకు టికెట్లు రావొచ్చు.. టికెట్లు ఇస్తామని చెప్పిన వాళ్లకు ఇవ్వకపోవచ్చు అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో అందరికీ ఆశలు ఉంటాయనీ, ప్రజలు కోరుకునే వ్యక్తులను బలపరచాలన్నారు. 

23 వేల మంది జనాభాతో మున్సిపాలిటీకి ప్రపోజల్ పెడితే.. జిల్లా ఇన్ చార్జ్ మంత్రిని తనకు తెలియకుండా ఎలా చేస్తారు..? అని అడ్డుపడడం దురదృష్టకరం అని అన్నారు. ఆరు నూరైనా ఎన్నికల గడువు లోపే స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.