భద్రాచలం, వెలుగు : తాలిపేరు ప్రాజెక్టు ఆయకట్టుదారులందరికీ సాగునీరు ఇవ్వాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అధికారులను ఆదేశించారు. చర్ల మండలం సత్యనారాయణపురం రైతు వేదికలో ఆయకట్టుదారుల సమావేశం నిర్వహించారు. రైతులంతా తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాజెక్టు రిజర్వాయర్లోని నీటిని కుడి, ఎడమ కాల్వల ద్వారా పొలాలకు సకాలంలో సరఫరా చేయాలన్నారు. సాగునీటి సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఇరిగేషన్ ఇంజనీర్లపై ఉందని చెప్పారు. ఎప్పటికప్పుడు కాల్వలను తనిఖీ చేయాలని, బుంగలు ఏర్పడకుండా, నీరు వృథాగా పోకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో ఈఈ రాంప్రసాద్, రైతులు పాల్గొన్నారు.