ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి : తెల్లం వెంకట్రావు

ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి : తెల్లం వెంకట్రావు

భద్రాచలం, వెలుగు : దుమ్ముగూడెం మండలంలో నెలకొన్న ప్రజా సమస్యలపై ఆఫీసర్లు దృష్టిసారించాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సూచించారు. మండల సర్వసభ్య సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో వరదలు, వ్యాధులతో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి ప్రజలను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో ముందు నుంచే అన్ని రకాల చర్యలు చేపట్టాలని సూచించారు.  పీహెచ్​సీల్లో మందులు నిల్వ ఉంచుకోవాలన్నారు. తాగునీటి సమస్య రాకుండా చూడాలని సూచించారు.

వాగులు, నదుల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఆఫీసర్లు తమ విభాగాల్లో చేపడుతున్న పనుల గురించి వివరించారు.  ఈ సమావేశంలో జడ్పీటీసీ సీతమ్మ, ఎంపీపీ రేసు లక్ష్మి, మండల అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కల్యాణ లక్ష్మి చెక్కులు  పంపిణీ చేశారు. గంజాయి నిర్మూలన, నాటుసారా, నల్లబెల్లం అమ్మకాల నియంత్రణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేశారు. నర్సాపురం పీహెచ్​సీలో సికిల్ ​సెల్​ అనీమియా అవగాహన సదస్సులో పాల్గొని పలు సూచనలు చేశారు. దుమ్ముగూడెం మండలం అచ్యుతాపురం గిరిజనుల కోరిక మేరకు గ్రామ రోడ్డును పరిశీలించి బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు.