రూ.985 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మిస్తాం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

రూ.985 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మిస్తాం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు:  వనపర్తి నియోజకవర్గంలో  త్వరలోనే రూ.985 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనున్నట్లు  ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్​ఎఫ్​ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో  ఆయన పాల్గొని మాట్లాడారు.  గత పాలకులు వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువగా చేశారని ఆరోపించారు.  తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి  15 నెలల కాలంలో రూ.1000 కోట్ల అభివృద్ధి పనులు చేశానని మరో రూ.1000 కోట్ల అభివృద్ధి పనులకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.  

నియోజకవర్గంలో నిర్మించిన ఏదుల రిజర్వాయర్ తో ఒక్క చుక్క నీరు కూడా నియోజకవర్గానికి రాదని అలాంటి ఏదుల రిజర్వాయర్ నుంచి లింకు కెనాల్ ఏర్పాటుచేసి వనపర్తి నియోజకవర్గం లోని పలు మండలాలకు సాగునీరు అందించేందుకు కృషి  చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.   త్వరలోనే మహిళల భాగస్వామ్యంతో 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన  సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.  నియోజకవర్గ పరిధిలోని 207 లబ్ధిదారులకు రూ.2,07,24,012  విలువైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు ఆయా గ్రామాల నాయకులు  పాల్గొన్నారు.