రెవెన్యూ డివిజన్​గా మారనున్నపెబ్బేరు : ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి 

  • హెల్త్​ మినిస్టర్​ చేతులమీదుగా 30 బెడ్స్​  హాస్పిటల్​కు శ్రీకారం
  • ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి 

పెబ్బేరు/శ్రీరంగాపూర్​ వెలుగు : మరి కొద్దిరోజుల్లో పెబ్బేరు మున్సిపాలిటీ రెవెన్యూ డివిజన్​ గా మారనుందని, దానికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం జీవోను విడుదల చేయనుందని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. శనివారం ఆయన శ్రీరంగాపూర్​, పెబ్బేరు మండలాల్లో పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. శ్రీరంగాపూర్​ మండలం తాటిపాముల గ్రామంలో రూ.70 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.రూ.18 లక్షల వ్యయంతో పాఠశాలలో అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

కంబాళాపూర్​, షేరుపల్లి, వెంకటాపూర్​ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. శ్రీరంగాపూర్​ మండలకేంద్రం నుంచి రంగవరం   ఫార్మేషన్ రోడ్డు నిర్మాణ పనులు, కేజీబీవీ స్కూల్​ కాంపౌండ్​ వాల్​ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం పెబ్బేరు మున్సిపాలిటీలో ఇటీవల ప్రారంభమైన రోడ్డు విస్తరణలో భాగంగా డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించారు పెబ్బేరు పట్టణంలోని పీహెచ్​సీ స్థానంలో 30 బెడ్​ హాస్పిటల్​ నిర్మాణానికి ఈ నెల 23న హెల్త్​ మినిస్టర్​ దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్​ చైర్​ పర్సన్​ కరుణశ్రీ, వైస్​ ఛైర్మన్​ కర్రెస్వామి, కౌన్సిలర్లు అక్కమ్మ, పార్వతి, సుమతి, పద్మ, ఎల్లస్వామి, చిన్నఎల్లా రెడ్డి, పెబ్బేరు ఏఎంసీ చైర్​పర్సన్​, వైస్​ ఛైర్మన్ ప్రమోదిని రెడ్డి, విజయవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.