వనపర్తి, వెలుగు : పదేళ్ల పాలనలో అన్నదాతల ఉసురు పోసుకున్నది బీఆర్ఎస్యేనని, అనర్హులను కమిటీ చైర్మన్గా నియమించి శవరాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ. లక్ష రుణమాఫీని పదేళ్లపాటు చేస్తే అది మిత్తిలకే సరిపోయిందని, తీసుకున్న ఆ అప్పు అట్లాగే బ్యాంకుల్లో ఉందని, కేవలం రైతుబంధు ఇస్తున్నామనే నెపంతో రైతులకు ఇచ్చే రాయితీ లను ఎత్తివేశారని విమర్శించారు. అన్నదాతలకు సబ్సిడీతో ఇచ్చే స్ప్రింకర్లు లేవు, డ్రిప్పు పైపులు లేవు, వేరుశనగ విత్తనాలు లేవు, వరి విత్తనాలు లేవు, రోటవేటర్ లేదు, కల్టివేటర్ లేదు, ఇట్లా రాయితీపై ఇచ్చే వాటన్నింటిని ఎత్తేసి తాము రైతుబంధు ఇచ్చామని జబ్బలు చరుచుకున్నారని దుయ్యబట్టారు.
వనపర్తి నియోజకవర్గ పరిధిలోని 25 అంగన్వాడీ కేంద్రాలకు, 23 ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రూ.1, 08,50,000 మంజూరైనట్లు ఆయన తెలిపారు. అంగన్వాడి కేంద్రాలలో, పాఠశాలలో వివిధ అత్యవసర సమస్యలను పరిష్కరించుకునేందుకు ఒక్కో అంగన్వాడి కేంద్రానికి రూ.2.50 లక్షలు, పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి గాను ఒక్కో పాఠశాలకు రూ.2 లక్షల చొప్పున నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు.