చేతిలో పెద్ద పుస్తకం ఉన్నా తన పంచాంగం తాను చెప్పుకోలేరని సామెత చెబుతారు. ఇప్పుడు ఓ ఎమ్మెల్యే పరిస్థితి ఇట్లాగే ఉందంటున్నారు. ఏదో ఊహించుకొని వస్తే ఇంకేదో అయ్యిందని తెగ ఫీలవుతున్నారట. ఎవరో ఇచ్చిన సలహాని నమ్ముకుంటే అసలుకే ఎసరొచ్చేలా ఉందని బాధపడుతున్నారు.
ఖమ్మం జిల్లా పాలేరు MLA కందాల ఉపేందర్ రెడ్డి పరిస్థితి విచిత్రంగా ఉందంటున్నారు ఆయన అనుచరులు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన కాంట్రాక్టులు, బిల్లుల కోసం పార్టీ మారారంటూ ప్రచారం జరిగింది. అయితే ఆయన అంచనాలు మాత్రం వేరే ఉన్నాయంటున్నారు ఆయన సన్నిహితులు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఓడించి గెలవడం వల్ల బీఆర్ఎస్ లో తనకు పెద్ద గౌరవం దక్కుతుందని అప్పట్లో ఆయన అనుకున్నట్లు చెబుతున్నారు. కొందరు సన్నిహితులు ఇట్లా చెప్పడం వల్లే నమ్మి బీఆర్ఎస్ లో చేరారట.
ఇప్పుడు పరిస్థితి చూసి ఆయనే ఫీలవుతున్నట్లు అనుచరుల్లో చర్చ జరుగుతోంది. పాలేరుకు ఎమ్మెల్యేను తానా, తుమ్మలా అన్నట్లుగా తయారైందని చెబుతున్నారు. అనుకున్నట్లుగా ఏ పదవీ దక్కకపోగా, మళ్ల టికెట్ వస్తుందో లేదో గ్యారంటీ లేకుండా ఉందన్న టాక్ నడుస్తోంది.
తుమ్మల ఓటమి తర్వాత పార్టీ కూడా ఆయన్ను పట్టించుకోలేదు. దీంతో ఆయన పలుమార్లు అనుచరులతో పబ్లిగ్గానే అసంతృప్తి బయటపెట్టారు. తర్వాత సడెన్ గా కేసీఆర్.. తుమ్మలను దగ్గర తీశారు. ప్రోటోకాల్ లేకున్నా అధికారిక కార్యక్రమాల్లో పక్కనే పెట్టుకుంటున్నారు. ఇది చూసే కందాల వర్గంలో టెన్షన్ మొదలైందని చెబుతున్నారు. పరిస్థితి చూస్తే సర్వేల పేరుతో తుమ్మలకే మొగ్గుచూపుతారన్న అనుమానాలు కందాల వర్గంల్లో బలంగా వినిపిస్తున్నాయి.
ఇటు తుమ్మల వర్గం, అటు కమ్యూనిస్టుల దూకుడుతో కందాల వర్గానికి నిద్రపట్టట్లేదని చెబుతున్నారు. కొందరు స్థానిక నేతలు కూడా ఎమ్మెల్యే కంటే తమ మాటే వినాలని అధికారులను కంట్రోల్ చేసే పరిస్థితి రావడం ఆయనకు ఇరకాటంగా మారిందంటున్నారు. గతంలో తుమ్మల ఎదుర్కొన్న పరిస్థితితే ఇప్పుడు కందాల చూస్తున్నారని పార్టీ జిల్లా నేతలు కామెంట్ చేస్తున్నారు. కొందరు నేతల అత్యుత్సాహంతో ఊరి గొడవల్లో తలదూర్చడం, పోలీసులతో దాడి చేయించడం, ప్రత్యర్థులపై కక్షసాధింపులు లాంటివి ఎమ్మెల్యే మెడకు చుట్టుకుంటున్నాయని చెబుతున్నారు.
ఇటు కేడర్ తుమ్మలతో పోవడం, అటు కమ్యూనిస్టులు పోటీచేసే ప్లాన్ తో ఉండడం రెండు రకాలుగా తలనొప్పేనని ఎమ్మెల్యే వర్గం ఫీలవుతోంది. ఇటు కమ్యూనిస్టులు కేసీఆర్ దోస్తీ కోసం చూస్తుంటే, అటు కందాల వారిపై పబ్లిగ్గానే కోపాన్ని బయటపెట్టారు. కమ్యూనిస్టులు చెబితే ఓట్లేసే రోజులు పోయాయని కామెంట్ చేశారు. పాలేరు బరిలో తానే ఉంటానని చెప్పుకున్నారు. మరోవైపు పాలేరు తరచూ టూర్లు చేస్తూ సీటు తనదేనన్న సంకేతాలిస్తున్నారు. దీనిపై కందాల వర్గం పార్టీకి ఫిర్యాదుచేసినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదంటున్నారు. చివరికి ఎమ్మెల్యే పరిస్థితి అంగడి అమ్మి గొంగళి కొన్నట్లుగా ఉందని ఆయన అనుచరులు ఫీలవుతున్నారట.