అమ్రాబాద్, వెలుగు: ఉమ్మడి అమ్రాబాద్ మండలంలో మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. శుక్రవారం అమ్రాబాద్, పదర మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదర, అమ్రాబాద్ మండలాల్లోని అన్ని గ్రామాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మిషన్ భగీరథ నీటిని సప్లై చేస్తామని తెలిపారు.
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని, మండలంలోని సీసీ రోడ్లు, ఆలయాల డెవలప్మెంట్కు నిధులు కేటాయించినట్లు చెప్పారు. అంతకుముందు పదరలో నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. మండల కేంద్రంలోని శ్రీ కృష్ణాలయం రిపేర్ల కోసం రూ.15 లక్షల ప్రొసీడింగ్ ను ఆలయ కమిటీకి అందజేశారు. ఎంపీడీవో వెంకటయ్య, ఆర్డబ్ల్యూఎస్ డీఈ హేమలత, నేతలు కుంద మల్లికార్జున్, ఆనంద్ పాల్గొన్నారు.