ఎమ్మెల్యే వనమా సుడిగాలి పర్యటన

పాల్వంచ రూరల్, వెలుగు: కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన పాల్వంచ మండల పరిధిలోని దంతెలబొర, గంగాదేవిగుప్ప, బండ్రుగొండ, సంగం, ఎస్సీ కాలనీ, నారాయణరావుపేట, రేపల్లె, బోజ్యతండా, నాగారం గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ.. కొన్ని పార్టీ లీడర్లు ముఖాలకు రంగులేసుకుని గ్రామాల్లోకి రాబోతున్నారని, గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో నిలదీయాలని పిలుపునిచ్చారు.

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరారు. ప్రతిపక్ష పార్టీల నేతలు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. దంతలబొర చుట్టుప్రక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కొత్తగూడెం కిందికి రానప్పటికీ సీఎంతో మాట్లాడి రూ.12 కోట్లతో బ్రిడ్జి నిర్మించానన్నారు. మరోసారి గెలిపిస్తే కేసీఆర్​తో ఉన్న స్నేహ బంధాన్ని నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడేలా చేస్తానన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్​ నాయకులు ఉన్నారు.