- రెండుచోట్లా కౌన్సిలర్ల తిరుగుబాటు
- రక్షించాలంటూ హైకమాండ్‌కు లోకల్‌బాడీ ప్రజాప్రతినిధులు, లీడర్ల మొర
- హైకమాండ్ రాయబారాలు ఫలించేనా?
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రామకృష్ణ కుటుంబం సూసైడ్ తర్వాత తీవ్ర విమర్శలపాలై, బీఆర్ఎస్నుంచి బహిష్కారానికి గురైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కొడుకు వనామా రాఘవ పార్టీలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఎమ్మెల్యేను పక్కనపెట్టి అన్ని వ్యవహారాలు తానే చూస్తుండడంతో స్థానిక ప్రజాప్రతినిధులు, లోకల్ లీడర్లు లోలోపలే రగిలిపోతున్నారు. పోయిందనుకున్న పీడ మళ్లీ వచ్చిందని బాహాటంగానే కామెంట్చేస్తున్నారు. ఇల్లెందులో ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ భర్త హరిసింగ్ తీరుపైనా ఫైర్అవుతున్నారు.
ఈ ఇద్దరూ షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తూ తమకు పూచికపుల్లంత విలువ ఇవ్వకుండా అణగదొక్కుతున్నారని ఆరోపిస్తూ రెండు చోట్ల కౌన్సిలర్లు తిరుబాటు చేయగా, వీరిని భరించడం ఇక తమ వల్ల కాదంటూ గ్రామాల్లో సర్పంచులు మొదలుకొని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పార్టీ హైకమాండ్‌కు మొరపెట్టుకోవడం కలకలం రేపుతోంది. వీరిని పక్కకు తప్పించకపోతే ఎన్నికల్లో సహకరించబోమని లీడర్లు అల్టిమేటాలు ఇస్తుండడంతో హైకమాండ్ మంత్రి సత్యవతి రాథోడ్‌తో పాటు ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవితతో రాయబారం నడపాల్సి వచ్చింది.
అంతా రాఘవ చెప్పినట్టే..
జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మున్సిపాలిటీలో షాడో ఎమ్మెల్యేగా పేరున్న వనమా రాఘవ తీరును నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు 20 మందికి పైగా గురు, శుక్రవారాల్లో రహస్య సమావేశాలు పెట్టుకున్నారు. ఆయన మారకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేయడానికి సిద్ధమని ప్రకటించారు. దీంతో కలకలం మొదలైంది. పాల్వంచలో రాఘవ వేధింపులతో రామకృష్ణ అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగిన తర్వాత పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు రావడంతో అధిష్టానం ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది.
కొంతకాలం జైలులో ఉన్న రాఘవ బెయిల్‌పై బయటకు వచ్చారు. కొద్దిరోజులకే మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. తన తండ్రి వనమా వెంకటేశ్వర్రావుకు షాడో ఎమ్మెల్యేలా మారి ప్రజాప్రతినిధులు, నాయకులపై పెత్తనం చలాయిస్తుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ మీటింగులతో పాటు నియోజకవర్గంలో జరిగే అన్ని పనులు ఆయన చెప్పిన ప్రకారమే జరగాలంటారని, స్టేజీ మీద ఎవరు కూర్చోవాలో కూడా రాఘవే నిర్ణయిస్తారని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్కమిషనర్ కూడా రాఘవ చెప్పినట్టే వింటారని, తమకు కనీస గౌరవం కూడా లేకుండా పోయిందని కౌన్సిలర్లు వాపోతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులను కూడా ఆయన చెప్పిన వారికే కేటాయించాలని ఆర్డర్వేస్తారని, అడిగినంత కమీషన్ఇవ్వాల్సిందేనని ఆరోపిస్తున్నారు. కొందరైతే బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే పాల్వంచ మండంలోని ముగ్గురు బీఆర్ఎస్ సర్పంచులు పార్టీకి రాజీనామా చేశారు. పాల్వంచ బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ రాజు కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోవైపు సుజాతనగర్ మండలంలో ఎంపీపీ పదవి విషయంలోనూ ఎంపీటీసీ బానోత్ అనిత నిరాశ చెందారు. ప్రస్తుత ఎంపీపీగా ఉన్న విజయలక్ష్మి రెండున్నరేండ్లు, నర్సింహసాగారం ఎంపీటీసీ బానోత్ అనిత మిగిలిన రెండున్నరేండ్లు పదవిలో కొనసాగేలా అప్పట్లో రాఘవ ఒప్పందం చేశారు. విజయలక్ష్మి పదవీకాలం పూర్తయిన తర్వాత అనిత తనకు ఎంపీపీ పదవి ఇవ్వాలని రాఘవకు విన్నవించుకున్నా ఆయన నోరు విప్పలేదు. విజయలక్ష్మికి ఆయన మద్దతు ఉండడంతో అనిత సైలెన్స్ అయిపోయారు.
రాయబారాలు ఫలిస్తాయా?
కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల్లో షాడో ఎమ్మెల్యేల గురించి లోకల్‌బాడీ ప్రజాప్రతినిధులు, నాయకులు బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మంత్రులు హరీశ్‌రావు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన తీరు మార్చుకోకపోతే ఎమ్మెల్యే గెలుపు కోసం తాము పనిచేయలేమని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కేటీఆర్ ఆదేశాలతో శుక్రవారం మున్సిపల్ కౌన్సిలర్లతో వద్దిరాజు రవిచంద్ర కొత్తగూడెంలోని పార్టీ ఆఫీసులో దాదాపు నాలుగు గంటల పాటు మీటింగ్ నిర్వహించి బుజ్జగించారు. ఇల్లెందులో మంత్రి సత్యవతి రాథోడ్‌తో పాటు ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత అసమ్మతి నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. షాడో ఎమ్మెల్యేల పెత్తనం లేకుండా చేస్తామని హామీ ఇవ్వగా సరేనన్న లీడర్లు వెళ్లిపోయినట్టు తెలిసింది.
హరిసింగ్‌తో వేగలేకపోతున్నం..
ఇల్లెందులో ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ భర్త హరిసింగ్ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఆయన చెప్పిందే నియోజకవర్గంలో వేదమని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆరోపిస్తున్నారు. టేకులపల్లి, ఇల్లెందు, కామేపల్లి, బయ్యారం, గార్ల మండలాలకు చెందిన ముఖ్య నేతలు గత నెలలో ఇల్లెందు మున్సిపల్‌చైర్మన్ డి.వెంకటేశ్వరరావు ఇంట్లో రహస్య సమావేశం పెట్టుకుని హరిసింగ్పెత్తనాన్ని నిరసించారు. ఇల్లెందు కౌన్సిలర్ల కూడా హరిసింగ్తీరుపై మండిపడుతున్నారు. మండలాలతో పాటు మున్సిపాలిటీలో హరిసింగ్‌కు తెలియకుండా ఏ పని జరగదని, ఆయన చెప్పినంత కమీషన్ఇవ్వకుంటే పనులు ముందుకు సాగవని ఆరోపిస్తున్నారు. ఇల్లెందు, టేకులపల్లి ప్రాంతాల్లో ఆయన భూ కబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఎదురుచెప్పిన వాళ్లను పోలీసులతో వేధిస్తారని అంటున్నారు. హరిసింగ్ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని నాలుగైదు రోజుల కింద బయ్యారం మండలంలోని పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు మెంబర్లు, లీడర్లు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్పార్టీకి రాజీనామా చేశారు.