టికెట్​ కన్ఫర్మ్​ అయినా..  టెన్షన్​లో వనమా

  • అనర్హతపై రెండు వారాల్లో సుప్రీంకోర్టు నిర్ణయం
  • హైకోర్టు తీర్పునే సమర్ధిస్తే  ఫ్యూచర్​పై ఎఫెక్ట్​ 
  • తీర్పు ప్రతికూలంగా వస్తే టికెట్​ మార్చే చాన్స్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బీఆర్ఎస్​టికెట్ దక్కినా.. సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావులో టెన్షన్​ తగ్గడంలేదు.  అనర్హత వేటు వేస్తూ హైకోర్ట్​ ఇచ్చిన తీర్పుపై ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో రెండు వారాల్లో  సుప్రీంకోర్ట్​ నిర్ణయం వెలువడనుంది. హైకోర్టు  తీర్పునే సుప్రీం కోర్టు సమర్ధిస్తే వనమాకు చుక్కెదురవుతుందని, ఇది ఆయన రాజకీయ భవితవ్యం మీద ప్రభావం చూపుతుందని రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు.   

సర్వత్రా ఉత్కంఠ

వనమా వెంకటేశ్వరరావు 2018 ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని, ఆయనను  అనర్హుడిగా ప్రకటించాలని కొత్తగూడెంలో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్​ 2019లో హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసులో ఇటీవల  తీర్పు వచ్చింది.  వనమాను అనర్హుడిగా ప్రకటించిన కోర్టు.. ఆయన 2018 నుంచే ఎమ్మెల్యేగా కొనసాగినట్టు భావించరాదని,  రెండో ప్లేస్​లో ఉన్న జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా కొనసాగించాలని పేర్కొంది.  తీర్పు వెలువడిన వెంటనే  జలగం వెంకట్రావు  ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి  తనకు అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్​లను కోరారు. దీంతో తన అనర్హతపై స్టే కోరుతూ  వనమా  సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదన విన్న సుప్రీంకోర్టు తీర్పుపై స్టే ఇస్తూ.. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. కేసుకు సంబంధించిన ఆధారాలను రెండువారాల్లో సమర్పించాలని జలగం వెంకట్రావును ఆదేశించగా, ఆయన తన న్యాయవాదుల ద్వారా డాక్యుమెంట్లను సుప్రీంకోర్టు అందజేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉండనుందోనన్నది ప్రస్తుతం నియోజకవర్గంలో హాట్​టాపిక్ గా మారింది.

జలగం దారెటు? 

హైకోర్టు తీర్పునే సుప్రీం కోర్టు సమర్ధించినట్టయితే వనమా అభ్యర్థిత్వాన్ని బీఆర్​ఎస్​ హైకమాండ్​ మార్చవచ్చునన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన స్థానంలో ఎమ్మెల్యే అయ్యే జలగం వెంకట్రావుకు బీఆర్​ఎస్​ టికెట్​ ఇస్తారో లేదో నని ఆయన సన్నిహితులు సందేహిస్తున్నారు. ఒకవేళ జలగం కేసు గెలిచిన తర్వాత కూడా బీఆర్​ఎస్​ టికెట్​ ఇవ్వకపోతే  ఆయన కాంగ్రెస్​ నుంచి గానీ.. ఇండిపెండెంట్​గా గానీ పోటీ చేస్తారన్న వాదన వినిపిస్తోంది. ఇద్దరినీ కాదంటే తనకు అవకాశం దక్కక పోతుందా అని  డైరెక్టర్​ హెల్త్   గడల శ్రీనివాసరావు ఆశ పెట్టుకున్నారు.