షాద్ నగర్, వెలుగు: అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్నపల్లి శంకర్ అన్నారు. బుధవారం షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, బ్యాంకర్ లతో ఎమ్మెల్యే శంకర్ రుణమాఫీ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. రైతుల ఖాతాల్లో దొర్లిన తప్పులను సరిచేసి రుణ మాఫీ అందేటట్లు చూడాలన్నారు. అర్హులైన రుణమాఫీ వర్తించని రైతుల వివరాల నమోదుకు ప్రభుత్వం రైతుభరోసా పంట రుణమాఫీ యాప్ ను తీసుకొచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో ఏడీ రాజారత్నం, ఆరు మండలాల ఏవోలు, బ్యాంకు అధికారులు తదితరులున్నారు.