షాద్​నగర్​లో హైడ్రా అమలు చేయండి : వీర్లపల్లి శంకర్

షాద్​నగర్​లో హైడ్రా అమలు చేయండి : వీర్లపల్లి శంకర్
  • చెరువులు, కుంటలు కబ్జా అయినయ్
  • సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్, వెలుగు: షాద్​నగర్ ప్రాంతంలో హైడ్రా అమలు కోసం సీఎం రేవంత్​రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. అక్రమ నిర్మాణాల విషయంలో హైడ్రా తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని తెలిపారు. షాద్​నగర్​లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​లో సోమవారం ఆయన మాట్లాడారు. ‘‘హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాతో రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేకెత్తుతున్నాయి. 

ప్రభుత్వం ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నది. ఏ ప్రభుత్వం.. ఏ సీఎం చేయని ధైర్యాన్ని రేవంత్ రెడ్డి ప్రదర్శించారు. అక్రమ కట్టడాలను కూలుస్తూ చెరువులు, కుంటలు, ఫీడర్ ఛానల్స్​ను కాపాడుతున్న తీరు బాగున్నది. హైడ్రా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. రంగనాథ్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. భవిష్యత్ తరాలు బాగుండాలంటే నీటి వనరులు, ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యత పాలకులపైనే ఉంటది’’అని శంకర్ అన్నారు. 

నీటి వనరులు ధ్వంసం చేసిన్రు

షాద్​నగర్ సెగ్మెంట్​లో కూడా నీటి వనరులను ధ్వంసం చేశారని వీర్లపల్లి శంకర్ మండిపడ్డారు. ‘‘వికారాబాద్ నుంచి నియోజకవర్గంలోని రెడ్డిపాలెం వరకు వచ్చే ఫిరంగి కాలువను మొత్తం ధ్వంసం చేసి అక్రమ కట్టడాలు నిర్మించారు. నీటి వనరుల సమస్య సృష్టించారు. ఫిరంగి కాలువ అక్రమాలపై గతంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఎన్నో ఫిర్యాదులు చేశారు. ఫరూక్​నగర్​లోని బొబ్బిలి చెరువు భూమిలో కూడా అక్రమ కట్టడాలు జరిగాయి. వాటికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి’’అని అన్నారు. 

అక్కమ చెరువు, అంచుకుంట చెరువు గత పాలకుల, రియల్టర్ల చేతిలో కబ్జాకు గురయ్యాయని తెలిపారు. దీంతో నీటి వనరులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇలాంటి సమస్యలు నియోజకవర్గంలో చాలానే ఉన్నాయని తెలిపారు. చెరువులు, కుంటలు కబ్జా చేశారని, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు నిర్మించారన్నారు. హైడ్రా ఇక్కడ కూడా అమలు చేస్తే బాగుంటుందని తెలిపారు. సమావేశంలో పీసీసీ సభ్యుడు మహమ్మద్ అలీఖాన్ బాబర్, పార్టీ సీనియర్ నేతలు జగదీశ్వరప్ప, చల్లా శ్రీకాంత్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, చెంది తిరుపతి రెడ్డి, గూడ వీరేశం, హరినాథ్ రెడ్డి, సయ్యద్ ఖదీర్ తదితరులున్నారు.