
షాద్‌నగర్, వెలుగు: లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ త్వరలో సాకారం కానుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. గురువారం షాద్‌నగర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 20 ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టును గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఆందోళనలపై అక్రమ కేసులు పెట్టిందని విమర్శించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని తెలిపారు.
షాద్‌నగర్‌తో పాటు చేవెళ్ల, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాలకు లాభం చేకూరుతుందని చెప్పారు. గతంలో తాను, పాలమూరు ఐక్యవేదిక కన్వీనర్ రాఘవులు చేసిన పోరాటం ఫలితమే ఇదని, రైతుల సాగునీటి సమస్య తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, కంసాన్‌పల్లిలోని పశు వీర్య ఉత్పత్తి కేంద్రానికి రూ.21 కోట్లు మంజూరైనట్లు ప్రకటించారు. గత ప్రభుత్వం అరకొర సౌకర్యాలతో వదిలేసిన ఈ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని, ఉపముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మండల పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి,గిరిజన కోఆర్డినేటర్ రఘు, కృష్ణారెడ్డి, అగ్గునూరు విశ్వం, కొంకళ్ళ చెన్నయ్య, ఇబ్రహీం, గడ్డం శ్రీనివాస్ యాదవ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.