- ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ, వెలుగు : వంద రోజుల్లో హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌కు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలను ఓట్లడిగే హక్కు లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం వేల్పూరులో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు పుష్కలమైన సాగు నీరు, 24 గంటల కరెంట్, రైతు బంధు ఇచ్చామన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంట్ కష్టాలు, సాగునీరు సరిగా ఇవ్వక.. ఎండిపోయిన బోర్లు, కాలిపోతున్న మోటార్లతో రైతులకు దుఃఖమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు, ఎంపీపీ జడ్పీటీసీలు, మండల రైతు బంధు సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.