హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పార్టీ ఫిరాయించడాన్ని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తప్పుపట్టారు. ఈ వయసులో పార్టీ మారి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోచారానికి కేసీఆర్ అధిక ప్రాధాన్యమిచ్చారని అన్నారు. ప్రాణం పోయే వరకు కేసీఆర్ వెంటే ఉంటానని గతంలో పోచారం అన్న విషయాన్ని ప్రకటనలో ప్రస్తావించారు.
పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం అత్యంత బాధాకరమని అన్నారు. మరోవైపు తన ఇసుక దందా సాగడం లేదన్న కారణంతోనే పోచారం పార్టీ మారారని బాజిరెడ్డి గోవర్ధన్ ఒక ప్రకటనలో ఆరోపించారు.