ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోం : ఎమ్మెల్యే వేముల వీరేశం

ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోం : ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్, వెలుగు : ప్రభుత్వంపై బీఆర్ఎస్​నాయకులు అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోమని ఎమ్మెల్యే వేముల వీరేశం హెచ్చరించారు. గురువారం పట్టణంలోని పన్నాలగూడెం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు పదేండ్లు అధికారమిస్తే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చని అసమర్థులని మండిపడ్డారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేఆర్ఎంబీ జలాల్లో వాడిన నీటి శాతం ఎంత..? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాడిన నీటి శాతంపై చర్చలకు సిద్ధమా..? అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి సవాల్ విసిరారు. 

కేఆర్ఎంబీ జలాల విషయంలో జగదీశ్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. జిల్లాకు కృష్ణానది నుంచి చుక్క నీరు తేలేకపోయారని, బ్రాహ్మణ వెల్లెంల, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి పల్లి, దిండి, నక్కల గండి ప్రాజెక్టులను పూర్తి చేయలేదన్నారు. అహర్నిశలు కాంగ్రెస్ మంత్రులు కష్టపడుతుంటే అది చూసి ఓర్వలేని జగదీశ్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల పనులన్నీ వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, నాయకులు లింగాల వెంకన్న, యాసారపు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.