హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై కాంగ్రెస్ నేత, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం (నవంబర్ 14) గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు. అప్పటి ప్రతిపక్ష నేతలు, సెలబ్రేటిలు, బిల్డర్లు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్ చేయించింది.. దొంగచాటుగా విన్నది కేటీఆరేనని అన్నారు. ట్యాపింగ్ చేసిన ఫోన్ రికార్డ్లను కేటీఆర్ దొంగచాటుగా విన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
నా ఫోన్ కూడా ట్యాప్ చేయించారని.. అయినప్పటికీ నా విజయాన్ని అపలేకపోయారన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ తన బుద్ధి మార్చుకోవాలని సూచించారు. అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ టేబుల్‌పై రివాల్వర్ పెట్టి నన్ను బెదిరించాడని ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన ఆరోపణలు చేశారు. అధికారంలో ఉండగా కేటీఆర్ చేసిన దుర్మార్గాలన్ని త్వరలోనే బయటపెడతామని అన్నారు. కాగా, గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా పోలీసులు దూకుడు పెంచారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అధికారులనే విచారించిన పోలీసులు.. పొలిటిషియన్స్ పాత్ర నిగ్గు తేల్చడంపై దృష్టి సారించారు.
ALSO READ | కులగణన ఆధారంగా సంక్షేమ పథకాలు తొలగించం: CM రేవంత్ కీలక ప్రకటన
ఇందులో భాగంగానే ఇటీవల బీఆర్ఎస్ నేత, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు మరో నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటిసులు ఇచ్చినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందటంతో చిరుమర్తి లింగయ్య 2024, నవంబర్ 14వ తేదీన పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన తిరుపతన్నతో గల సంబంధాలపై చిరుమర్తిని పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం.