నకిరేకల్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం (నవంబర్ 15) నకిరేకల్ పట్టణంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నాడని.. పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై నీచాతి నీచంగా మాట్లాడుతున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులకు ఉద్యోగాల కోసమే కొడంగల్‌లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని.. లగచర్లలో ఏమి జరిగిందో తెలుసుకోకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడని చురకలంటించారు.
కేటీఆర్ బీఆర్ఎస్ కార్యకర్త సురేష్‌ను పంపించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో కలిసి లగచర్లో కలెక్టర్‌పై దాడి చేయించారని ఆరోపించారు. లగచర్లలో విధ్వంసాన్ని అంతా మీడియా చూపించిందని.. ఎందుకు మీరు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీంగా మారి ఇలాంటి ఘర్షణలకు దిగుతున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
బీఆర్ఎస్ పార్టీ విధానం దాడులు చేయడమేనా కేటీఆర్ స్పష్టం చేయాలని నిలదీశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై దాడిని ఖండిస్తూ.. ఐఏఎస్‌లకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల లబ్ధి కోసమే ప్రాజెక్టులు నిర్మించారని ఆరోపించారు. అరెస్ట్ చేస్తే జైలుకు పోయి స్లిమ్ అవుతానన్న కేటీఆర్ వ్యాఖ్యలకు వీరేశం కౌంటర్ ఇచ్చారు.
జైలుకు పోయి స్లిమ్‌గా తయారై వచ్చి రాజకీయాలు మానేసి సినిమాలు తీసుకో అని కేటీఆర్‌కు సూచించారు. కేటీఆర్ చెప్పే అబద్ధాలను తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మవద్దని వీరేశం విజ్ఞప్తి చేశారు. మీరు చేసిన తప్పులకు కచ్చితంగా పరిహారం ఉంటుందని, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల భూముల గురించి దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేటీఆర్ ఇప్పటికైనా అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన తప్పులను ఒప్పుకొని పోలీసులకు సరెండర్ కావాలని సూచించారు.