కోరుట్ల రూరల్, వెలుగు: ‘ప్రతి మండలంలో తాగునీటి సమస్య ఉంది.. మిషన్ భగీరథ ఆఫీసర్లు సరిగ్గా పనిచేయడం లేదు.. ఏ మీటింగ్లో అడిగినా నెలరోజుల్లో పనులు అయిపోతయంటరు.. ఏడాదిగా ఇదే మాట చెప్తున్నరు.. దున్నపోతుపై వర్షం, ఎండ కొట్టినట్లు ఉంది.. నేను ఎమ్మెల్యేని అయిపోయాను గాని లేకుంటే వీళ్లను దెబ్బలు కొట్టేవాడిని’ అంటూ మిషన్ భగీరథ ఆఫీసర్లపై కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మండిపడ్డారు. సోమవారం కోరుట్ల ఎంపీడీవో ఆఫీసులో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ శాఖలో సమస్యలు లేవని, ప్రతి మండలంలో ఒక్క మిషన్ భగీరథపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని విద్యాసాగర్ రావు అన్నారు. మిషన్ భగీరథ ఆఫీసర్ల పని తీరు ఏమాత్రం బాగాలేదని అసహనం వ్యక్తం చేశారు. గ్రామాలకు వెళ్లి అక్కడున్న ప్రజాప్రతినిధులతో కలిసి సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏనాడు ఏఈ, డీఈలు వచ్చినట్లు ఏ ఒక్కరు తనకు చెప్పలేదన్నారు. ఆఫీసర్లుగా మీరు, లీడర్లుగా మేము ప్రజల సొమ్ము తింటున్నామని, అలాంటి ప్రజల కోసం పనిచేయకపోతే మనం ఉండి ఎందుకన్నారు. కలెక్టర్ ఎన్ని సార్లు మీటింగ్ పెట్టినా మిషన్ భగీరథ అధికారుల్లో చలనం లేదని, కనీసం రోజుకో గంటైనా డ్యూటీ చేయాలని సూచించారు.