- పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి పట్టణానికి బైపాస్ రోడ్డుతో పాటు జిల్లా కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను కోరారు. పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన అనంతరం శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రగతి సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడారు.
పెద్దపల్లి నుంచి జమ్మికుంట రోడ్డును పొత్కపల్లి మీదుగా వెళ్లే విధంగా రోడ్డు వేస్తే 14 కిలో మీటర్లు తగ్గుతుందన్నారు. ఓదెల మండలం శ్రీరాంపూర్ మండలంలోని రైతులకు చాలా ఉపయోగపడుతుందని, ఆ బ్రిడ్జి త్వరగా మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. టెయిల్ ఎండ్ ప్రాంతాల ప్రజలకు శాశ్వత సాగునీటి సమస్య పరిష్కరించేందుకు పత్తిపాక రిజర్వాయర్ పనులు చేపట్టి పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు.
సుల్తానాబాద్ లో మంజూరు చేసిన భూమిలో ఐటీ టవర్ నిర్మాణం చేపట్టాలని కోరారు. పెద్దపల్లి నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదనలు పరిశీలించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.