
పెద్దపల్లి/ సుల్తానాబాద్, వెలుగు: ఇటీవల కురిసిన వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు భరోసా కల్పించారు. ఆదివారం జూలపల్లి మండల కేంద్రంతోపాటు కోనరావుపేట, ఎలిగేడు మండలం ధూళికట్ట, పెద్దపల్లి మండలం భోజన్నపేట, చీకురాయి, హనుమంతుని పేట గ్రామాల్లో వానలతో దెబ్బతిన్న పంట పొలాలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టంపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. యాసంగిలో చివరి మడికి సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అంతకుముందు సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల పీఏసీఎస్ 130 మహాజనసభలో పాల్గొన్నారు. సొసైటీ పరిధిలోని రైతులకు రూ.18 లక్షల దీర్ఘకాలిక రుణాలను పంపిణీ చేశారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఉదయ్ నగర్ లో నిర్మించిన కమాన్‌ను ప్రారంభించారు. పీఏసీఎస్ చైర్మన్ దేవరనేని మోహన్ రావు, మార్కెట్ చైర్ పర్సన్లు ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాశ్‌రావు, సీఈవో వి.రమేశ్ డైరెక్టర్లు, లీడర్లు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పెద్దపల్లి జిల్లా దిశ కమిటీ మెంబర్, మాజీ సర్పంచ్ సయ్యద్ సజ్జద్ ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు.