
సుల్తానాబాద్/పెద్దపల్లి, వెలుగు: సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్పష్టం చేశారు. బుధవారం సుల్తానాబాద్ లో రాజీవ్ రహదారి నుంచి పూసాల వరకు రూ.1.50 కోట్లతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, పెద్దపల్లి మండలం నిట్టూరు, జూలపల్లి, ఎలిగేడు మండలాల్లోని పలు గ్రామాల్లో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సన్న బియ్యం పంపిణీ దేశంలోనే చారిత్రక నిర్ణయమన్నారు. సుల్తానాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పూసాల రోడ్డుకు డివైడర్ తోపాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పట్టణంలో రోడ్ల వెడల్పుకు సహకరించిన ఇంటి యజమానులను అభినందించారు. కార్యక్రమంలో సుల్తానాబాద్ ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్, లీడర్లు మహేందర్, కృష్ణ, సతీశ్ , అబ్బయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.